తెలంగాణ: తెలంగాణ నిరుద్యోగుల వినూత్న నిరసన ... చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం!
- డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడక పోవడంపై నిరుద్యోగుల ఆగ్రహం
- ఏపీ సీఎం చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం
- మహబూబ్ నగర్ లో వినూత్న నిరసన
ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. అయితే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం డీఎస్సీ నోటిఫికేషన్ ఇంతవరకూ వెలువడలేదు. దీంతో, తెలంగాణలోని నిరుద్యోగులు అసహనానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ లో ఈరోజు జరిగింది.
ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ, డీఎస్సీకి సంబంధించి ఏపీలో రెండో నోటిఫికేషన్ కూడా వెలువడిందని, తెలంగాణలో అసలు నోటిఫికేషన్ వెలువడలేదంటూ మండిపడ్డారు. కాగా, ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ నిన్న వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 12370 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.