జగన్: అందుకే ‘నలభై ఐదేళ్లకే పెన్షన్’ ఇస్తానన్నాను: వివరించిన జగన్
- పాదయాత్ర ప్రారంభానికి కొన్ని రోజులు ముందు ధర్మవరం వెళ్లాను
- చేనేత కార్మికుల నిరాహార దీక్ష చూసి చలించిపోయా
- కష్టజీవుల్లో నలభై ఐదేళ్లు వచ్చేసరికే పని చేసే శక్తి తగ్గిపోతుంది
- వారికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నా: జగన్
తాను అధికారంలోకి వస్తే ‘నలభై ఐదేళ్లకే పెన్షన్’ ఇస్తానని వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రలో ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ‘సాక్షి’ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన్ని ప్రశ్నించగా, ‘నా పాదయాత్ర ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు ధర్మవరం వెళ్లాను. అప్పుడు చేనేత కార్మికులు 37 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్లిన రోజున మహిళా చేనేత కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
ఆ వాస్తవం ఓ ఉద్వేగానికి కారణమైంది. నలభై ఐదేళ్లకు పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయం అప్పుడే తీసుకున్నాను. చేనేత కార్మికులు, మత్స్యకారులు, పంట పొలాల్లో పని చేసే వారు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేద వర్గాల ప్రజలే. వీళ్లందరూ పేదోళ్లే. కడుపు నిండాలంటే పనిలోకి పోవాల్సిందే. ఇటువంటి వాళ్లు పని చేసీ చేసీ నలభై ఐదేళ్లు వచ్చేసరికే.. వారిలో పని చేసే సామర్థ్యం తీవ్రంగా తగ్గిపోతుంది. ఒక వారం రోజుల పాటు వీళ్లు అనారోగ్యానికి గురైతే పనిలోకి వెళ్లలేరు.. పస్తులుండాల్సిన పరిస్థితులు. ఇటువంటి వాళ్లకు నలభై ఐదేళ్లకే రూ.2000 పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. అదేమీ నాకు తప్పనిపించలేదు. ఇది కూడా చేయలేకపోతే మానవత్వం అనిపించుకోదు అని నాకు అనిపించింది’ అని జగన్ చెప్పారు.