హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి: చాప్లిన్ సినిమాలు నోరెళ్ల బెట్టి చూస్తుండే వాడిని: ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి
- చార్లీచాప్లిన్ అంటే నాకు చాలా ఇష్టం
- నాడు దూరదర్శన్ లో చాప్లిన్ ప్రసారాలను చూసేవాడిని
- కామెడీ అనేది నాలో నాటుకుపోవడానికి కారణం ఆయనే!
మహానటుడు చార్లీ చాప్లిన్ తనకు స్ఫూర్తి అని ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి అన్నాడు. ‘ఐడ్రీమ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి చార్లీ చాప్లిన్ అంటే తనకు ఇష్టమని, నాడు దూరదర్శన్ లో ప్రసారమైన చాప్లిన్ ధారా వాహిక కార్యక్రమాలను నోరెళ్ల బెట్టి చూస్తుండే వాడినని చెప్పాడు. కామెడీ అనేది నాలో నాటుకుపోవడానికి కారణం చాప్లిన్ అని, అంతేకాకుండా, సినిమాలు కూడా బాగా చూస్తుండే వాడినని చెప్పాడు. సినిమాలు చూసొచ్చి ఆ కథలను తన ఫ్రెండ్స్ కు చెబుతుండేవాడినంటూ నాటి విషయాలను గుర్తుచేసుకున్నాడు. సినిమాలంటే పిచ్చి ఉండేది కానీ, సినిమాల్లో నటించాలని మాత్రం తాను మొదట్లో అనుకోలేదని చెప్పాడు.
‘మొదట్లో నేను హైదరాబాద్ కు వచ్చినప్పుడు నాకు ఎటువంటి కాంటాక్టు నంబర్ లేదు. కూకట్ పల్లిలోని నా మిత్రుడి రూమ్ లో ఉండేవాడిని. పాన్ షాపుల్లో సిగిరెట్ కంపెనీల యాడ్ బోర్డ్స్ ఉంటాయి. వీటిని డెకరేట్ చేసి, ఆకట్టుకునే ఓ క్యాప్షన్ ని దానిపై రాస్తారు. మా మిత్రుడికి ఈ విషయంలో సాయపడుతుండేవాడిని. అతనికి ఉన్న ఫోన్ నెంబరే నా కాంటాక్టు నంబర్ అయింది. అలా, కాంటాక్టు నంబర్ సంపాదించుకున్న తర్వాత సినీ ప్రయత్నాలు చేయడం ప్రారంభించాను’ అని చెప్పుకొచ్చాడు. ‘కమెడియన్స్ అన్ని భావోద్వేగాలను పలికించగలరు. ఎమోషన్ సీన్ కంటెంట్ బలంగా ఉంటే ఆ సీన్ లో కమెడియన్ నటించినా పండుతుంది. అదే, కంటెంట్ బలహీనంగా ఉన్నప్పుడు ఆ సీన్ లో ఏడుస్తూ నటిస్తే ఎవరూ పట్టించుకోరు’ అని శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు.