జగన్: వైసీపీ అధినేత జగన్ పై తిరుపతి పాస్టర్ సంచలన వ్యాఖ్యలు!
- విగ్రహారాధన చేసిన జగన్ ని జీసస్ కచ్చితంగా శిక్షిస్తాడు
- విగ్రహారాధనను విడిచిపెడితే దేవుడు కచ్చితంగా జగన్ ని ముఖ్యమంత్రిని చేస్తాడు
- తిరుపతి చర్చిలో ఇటీవల తన ప్రసంగంలో పాస్టర్ డేవిడ్
వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రను ప్రారంభించడానికి ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై క్రిస్టియన్ సంఘాలు మండిపడుతున్నాయి. క్రైస్తవుడిగా ఉన్న జగన్, శ్రీవేంకటేశ్వరుడిని పూజించడంపై కొందరు పాస్టర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహారాధన చేసిన జగన్ ని జీసస్ కచ్చితంగా శిక్షిస్తాడని తిరుపతికి చెందిన పాస్టర్ డేవిడ్ కరుణాకరన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అయింది.
తిరుపతి చర్చిలో ఇటీవల ఆయన ఇచ్చిన సందేశం సంచలనాత్మకంగా మారింది. ఆ సందేశంలో డేవిడ్ కరుణాకరన్ మాట్లాడుతూ.. ‘ఎంత విచారకరమంటే... కొండ మీదకు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఆయన (జగన్) ఏమన్నారంటే.. పాదయాత్ర ప్రారంభించడానికి ముందు ఆయన (శ్రీవెంకటేశ్వరుడు) ఆశీర్వాదం ఉంటే బాగుంటుందని వచ్చాడంట!... ఆయన పశ్చాత్తాపం పొంది విగ్రహారాధనను విడిచిపెడితే దేవుడు కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తాడు.. ఆయన పశ్చాత్తాప పడకుండా విగ్రహారాధన చేస్తుంటే మాత్రం దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క ఆగ్రహంను, దేవుని యొక్క కోపంను.. ఆయన జీవితంలో చూడాల్సి వస్తుంది...’ అని ఆ ప్రసంగంలో ఆయన పేర్కొన్నట్టు ఓ టీవీ ఛానెల్ ప్రసారం చేసింది.
వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా చనిపోవడానికి కారణం నాడు విగ్రహారాధన చేయడమేనని పాస్టర్ డేవిడ్ కరుణాకరన్ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ విషయమై ఆయన్ని వివరణ కోరగా..‘విగ్రహారాధన చేయొద్దని ఏసు ప్రభు ప్రత్యేకించి చెప్పలేదు. ‘విగ్రహారాధన వల్లే వైఎస్ రాజశేఖరరెడ్డి గారు చనిపోయారేమో!’ అని అన్నాను తప్పా, ‘చనిపోయారు’ అని నేను చెప్పలేదు. హిందూ దేవుళ్లను నేను ఎప్పుడూ కించపరచ లేదు.. కించపరచను కూడా. నాలుగు రోజుల క్రితం నేను చర్చిలో చేసిన ప్రసంగం కేవలం క్రైస్తవుల కోసమే. మనందరం భారతీయులం’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా జగన్ ఇప్పటికైనా విగ్రహారాధనను మానివేయాలని మరికొందరు పాస్టర్లు ప్రార్థనలు చేసినట్టు సమాచారం.