YS Jagan: ఆ విషయాన్ని నిరూపించుకోవాల్సింది జగనే.. తేల్చి చెప్పిన చంద్రబాబు!

  • నా నాలుగు దశాబ్ద రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రతిపక్షాన్ని చూడలేదు
  • జగన్ అవినీతి సొమ్ము రాష్ట్ర ప్రజలకు చెందాలి
  • మొన్నేమో కుదరదన్నారు.. నేడు పింఛను రూ. 3 వేలు ఇస్తానంటున్నారు
  • ప్రతిపక్ష నేతపై చంద్రబాబు నిప్పులు

ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ విసిరిన సవాలుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారు. తాను అవినీతిపరుడో? కాదో? నిరూపించుకోవాల్సింది ఆయనేనని అన్నారు. తన వద్ద అక్రమాస్తులు లేవని జగనే నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. జగన్ అవినీతి రాష్ట్రానికే చెందాలని అన్నారు. ఈడీ జప్తు చేసిన ఆస్తులను రాష్ట్రానికి ఇవ్వాలని, అది రాష్ట్ర ప్రజలకు మాత్రమే చెందాలని సీఎం అన్నారు.  

గురువారం నిర్వహించిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇలాంటి దివాలాకోరు ప్రతిపక్షాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ఉపాధిహామీ పనుల్లో అవినీతి జరిగిందని కేంద్రానికి లేఖలు రాసి పేదోడి కడుపు కొట్టేందుకు చూశారని జగన్‌పై విరుచుకుపడ్డారు. శాసనసభకు వచ్చి ఉంటే ఆ లేఖలను బయటపెట్టే వాళ్లమని అన్నారు. జగన్ రాసిన లేఖలపై కేంద్రం విచారణ జరిపిన తర్వాత కూడా నిధులొచ్చాయని వివరించారు. ప్రతీదానికీ స్పీకర్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.  

వైసీపీ ఆరోపణలకు భయపడి పట్టిసీమ ప్రాజెక్టును కట్టకుండా ఉంటే ఈ రోజు కృష్ణా జిల్లా రైతులకు ఎకరానికి 50 బస్తాల దిగుబడి వచ్చి ఉండేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల్లో ఎన్నో అపోహలు సృష్టించేందుకు వైసీపీ యత్నించిందని ఆరోపించారు. అసెంబ్లీ భవనం లీకైందని ఆపోహలు సృష్టించేందుకు ప్రయత్నించారన్నారు. గతంలో రైతు రుణమాఫీ వీలుకాదని, అందుకే తాను ప్రకటించలేదని చెప్పిన జగన్ ఇప్పుడు తాను అధికారంలోకి వస్తే పింఛను సొమ్మును రూ.మూడు వేలకు పెంచుతాననడం ఆయన బాధ్యతారాహిత్య రాజకీయానికి నిదర్శమని చంద్రబాబు మండిపడ్డారు.

తనను నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం అహరహం శ్రమిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసంగా ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య ఉన్న ఓట్ల తేడా 1.6 శాతమే కాగా నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత అది 16 శాతానికి పెరిగిందని వివరించారు.

 రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలను ఇచ్చారని, వాటిని అభివృద్ధి చేసి మళ్లీ వారికే అప్పగిస్తామని సీఎం తెలిపారు. వారి భూములు వారి వద్దే ఉంటే లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వైసీపీ గగ్గోలు పెట్టడం వారి నైజాన్ని బయటపెడుతోందన్నారు. తాము పనిచేసేది ప్రజల కోసం తప్ప ప్రతిపక్షం కోసం కాదని చంద్రబాబు తేల్చి చెప్పారు. శాసన సభ్యులందరూ తప్పనిసరిగా సభలోనే ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

  • Loading...

More Telugu News