సత్య నాదెళ్ల: ‘మీ అభిమాన క్రికెటర్ ఎవరు?’ అనే ప్రశ్నకు సత్య నాదెళ్ల ఏం చెప్పారంటే..!
- నేను హైదరాబాదీని కాబట్టి నా అభిమాన క్రికెటర్ జయసింహ
- జయసింహ ఎంతో స్టైలిష్ గా ఉండేవారు
- ‘ర్యాపిడ్ ఫైర్’ ప్రశ్నకు సత్య నాదెళ్ల స్పందన
‘మీ అభిమాన క్రికెటర్ ఎవరు?’ అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను ప్రశ్నిస్తే..నాటి క్రికెటర్, హైదరాబాదీ జయసింహ అని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో పర్యటించిన సత్య నాదెళ్ల పాల్గొన్న ఓ కార్యక్రమంలో ‘ర్యాపిడ్ ఫైర్’ నిర్వహించారు. ఇందులో భాగంగా ‘సచిన్, జయసింహలలో మీ అభిమాన క్రికెటర్ ఎవరు?’ అని ఆయన్ని ప్రశ్నించగా, ‘ఇది చాలా కఠినమైన ప్రశ్న!’ నేనూ హైదరాబాదీని కనుక జయసింహనే ఎంచుకుంటా. జయసింహ గురించి ‘హిట్ రీఫ్రెష్’ అనే పుస్తకం ఈ ఏడాదిలోనే రాశాను.
ఈ పుస్తకంలో నేను ప్రస్తావించిన ఓ సంఘటన గురించి చెబుతా. ఒకసారి, మా నాన్న నా బెడ్ రూంలో కార్ల్ మార్క్స్ ఫొటో తగిలించారు. ఆ ఫొటో చూసిన మా అమ్మ ఆ పక్కనే లక్ష్మీదేవి ఫొటో పెట్టింది. అయితే, నాకు మాత్రం నా అభిమాన క్రికెటర్, హైదరాబాదీ దిగ్గజం జయసింహ ఫొటోను తగిలించుకోవాలని ఉండేది. జయసింహ క్రికెట్ మైదానంలోనే కాదు, బయట కూడా ఎంతో స్టైలిష్ గా కనిపించేవాడు’ అని సత్య నాదెళ్ల చెప్పుకొచ్చారు.
కాగా,1939 మార్చి 3న సికింద్రాబాద్ లో జయసింహ జన్మించారు. 1960ల నాటి క్రికెటర్ అయిన ఆయన, 1959-71 మధ్య 39 టెస్టులు ఆడి.. 2,056 పరుగులు చేశాడు.