Jagan: ఆ ఆరోపణలను చంద్రబాబు నిరూపించలేకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా?: జగన్ సవాల్
- చంద్రబాబుకి 15 రోజుల సమయం ఇస్తున్నా
- నాపై చేస్తోన్న ఆరోపణలను రుజువు చేయాలి
- ఒకవేళ చంద్రబాబు నిరూపించలేకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా?
- నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న పాదయాత్ర కొనసాగుతోంది. అందులో భాగంగా ఈ రోజు కడప జిల్లా వీఎన్‌పల్లిలో జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహిరంగ సవాల్ విసిరారు. చంద్రబాబుకు తాను 15 రోజుల సమయం ఇస్తున్నానని, తనకు విదేశాల్లో ఒక్క పైసా ఉందని చూపించినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని జగన్ అన్నారు. ఒక వేళ చంద్రబాబు నిరూపించలేకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. ప్యారడైజ్ పేపర్ల లీక్ పై ప్రస్తావిస్తూ జగన్ ఆ విధంగా అన్నారు.
తాను పాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో కొందరు ఉద్దేశపూర్వకంగానే తన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై ఇలాంటి ప్రచారాలు చేయడం చంద్రబాబుపై భజన చేసే మీడియాకు అలవాటైపోయిందని అన్నారు. తనకు నిజంగా విదేశాల్లో డబ్బుంటే తాము నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోయేవాళ్లమా? అని ఆయన అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం చంద్రబాబు డబ్బులు పంచారని జగన్ ఆరోపించారు.
తమ ఎమ్మెల్యేలకు రూ. 30 కోట్ల నుంచి, 40 కోట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు టీడీపీలోకి తీసుకుంటున్నారని, ఆయనకు అంత డబ్బు ఎలా వచ్చిందని జగన్ నిలదీశారు. ఆంధ్రజ్యోతి పేపర్ చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తోందని, నంద్యాల ఉప ఎన్నికల సమయంలో బీజేపీతో తాను కలిసి నడవబోతున్నానని కూడా కట్టు కథలు అల్లి కథనం ప్రచురించిందని మండిపడ్డారు.