చంద్రబాబు: యూనివర్శిటీ రోజులను గుర్తుచేసుకున్న చంద్రబాబు!
- నన్నయ వర్శిటీలో ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ కు శంకుస్థాపన
- ఏపీ విద్యార్థులు ప్రతిభకు మారుపేరు
- వెంకయ్యనాయుడి అండ రాష్ట్రానికి ఉంటుందన్న చంద్రబాబు
యూనివర్శిటీలో విద్యార్థుల ఉత్సాహం చూస్తుంటే తనకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని నన్నయ విశ్వవిద్యాలయంలో ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో తాను, విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో వెంకయ్యనాయుడు చదువుకునే రోజుల్లో చాలా ఉత్సాహంగా ఉండేవాళ్లమని నాటి రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు. ఎనిమిది వందల మంది కూర్చునేందుకు వీలుగా ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించనుండటం తనకు ఆనందంగా ఉందని అన్నారు.
అత్యధికంగా యువకులున్న దేశం మనదని, ప్రపంచ టెక్నాలజీకి భవిష్యత్ లో నాయకత్వం వహించేది మనమేనని అన్నారు. ఏపీ విద్యార్థులు ప్రతిభకు మారుపేరని, వారిని ఉత్సాహపరిచేందుకు ప్రతిభా అవార్డులను ఇస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గురించి ప్రస్తావిస్తూ, ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో లేకపోయినప్పటికీ, రాష్ట్రానికి అండగా మాత్రం ఉంటారని అన్నారు.