చంద్రబాబు: చంద్రబాబు నరనరాన కుట్రలు, కుతంత్రాలే : వైసీపీ నేత రోజా ధ్వజం

  • చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం కుట్రలతోనే నిండింది
  • రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న బాబు
  • బాబును ఇంటిదోవ పట్టించడానికే ప్రజా సంకల్ప యాత్ర
  • పాత్రికేయుల సమావేశంలో రోజా

చంద్రబాబు నరనరాన కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయని వైసీపీ అధినేత రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేత రోజా మాట్లాడుతూ, చంద్రబాబు కుట్రల గురించి నాడు ఎన్టీఆర్, ఆయన పెద్దల్లుడు, కూతురు పురందేశ్వరి, ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి, నందమూరి హరికృష్ణ పలు సందర్భాల్లో చెప్పారని అన్నారు.

చివరకు, చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు కూడా తన అన్న కుట్రలను ఎన్నో సందర్భాల్లో బయటపెట్టిన విషయం మన అందరికీ తెలిసిందేనని చెప్పారు. కుట్రలు చేసే అలవాటు చంద్రబాబుకు ఉందని, ఆయన రాజకీయ జీవితం మొత్తం కుట్రలతో నిండిందన్న విషయం రాజకీయాల్లో ఉన్న ప్రతిఒక్కరికీ తెలుసని విమర్శించారు.

తనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచింది చంద్రబాబునాయుడా? జగనా? అని ప్రశ్నించారు. టీడీపీకి చెందిన ఎర్ర చందనం స్మగ్లర్ల పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని చెప్పి, అమాయకులైన తమిళనాడు కూలీలను చంపించిన కుట్ర చంద్రబాబునాయుడు చేశారా? లేక జగన్ చేశారా? రాజధానిలో రైతుల భూములను తన ఎమ్మెల్యేలను, మంత్రులతో కలిసి దోచుకోవాలనే కుట్ర చంద్రబాబు చేశారా? జగన్ చేశారా? అంటూ మండిపడ్డారు.

పది సంవత్సరాలు కాదు, పదిహేను సంవత్సరాలు ఏపీకి ప్రత్యేకహోదా కావాలన్న పెద్దమనిషి, ఈ రోజున ప్రత్యేక హోదాతో ఉపయోగం లేదని అంటున్నాడని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలన్న కుట్రతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ పట్టుబడ్డ కుట్రదారుడు ఎవరు? అని ప్రశ్నించిన రోజా, చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ మూడున్నర లక్షల కోట్లకు పైగా దోచుకున్నారని, ఎక్కడ సీబీఐ ఎంక్వయిరీ వేస్తారోననే భయంతో కేంద్రం వద్ద సాగిలపడి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు.    

జగన్ ని ఎదుక్కోలేక చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్న చంద్రబాబు, సోనియాతో కలిసి జగన్ పై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. కుట్రలు చంద్రబాబు చేస్తూ, జగన్ చేస్తున్నారని చెప్పడం చూస్తుంటే గురివింద గింజ సామెత గుర్తొస్తోందని విమర్శించారు.

 తుని సంఘటనలో నిజంగా జగన్ కుట్ర చేసుంటే, మూడేళ్లుగా అధికారంలో ఉన్న మీరు ఆ విషయాన్ని ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్, నిఘా సంస్థల ద్వారా ఈ సంఘటనకు పాల్పడిందెవరనే విషయాన్ని కనిపెట్టే సత్తా లేదా? అని ప్రశ్నించిన రోజా, ఆయా నివేదికల్లో తుని విధ్వంసానికి కారణం టీడీపీయే అని వచ్చింది కాబట్టే చంద్రబాబు నోరుమెదపడం లేదని ఆరోపించారు.

రాజన్న కుటుంబంలో నాడు రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారని, షర్మిల కూడా మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర , జగన్ ఓదార్పు యాత్ర చేశారని.. ఆయా యాత్రల్లో ఏ రోజూ కూడా విధ్వంసం జరగలేదని అన్నారు. ఈ నెల 6 నుంచి జగన్ తలపెట్టనున్న ప్రజా సంకల్ప యాత్ర లో విధ్వంసం జరుగుతుందని  చంద్రబాబు మాట్లాడుతున్నారంటే, ఆయన ఏదో కుట్రకు పాల్పడుతున్నారని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు.

జగన్ సంకల్ప యాత్ర ద్వారా చంద్రబాబు కుట్రల గురించి ప్రతి కుటుంబానికి చెప్పి చైతన్యపరచబోతున్నారని అన్నారు. ఆరువందల హామీలిచ్చిన చంద్రబాబు, ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. అటువంటి చంద్రబాబును నడిరోడ్డుపై నిలబెట్టి ఆయన చేసిన తప్పులకు ప్రజలకు క్షమాపణలు చెప్పిస్తామని, బాబును ఇంటిదోవ పట్టించడానికి ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించనున్నామని రోజా అన్నారు.

  • Loading...

More Telugu News