పృథ్వీరాజ్: ‘మీరు కాపు’, ‘మీరు రెడ్డి’, ‘మీరు రాజు’ అనే కిరీటాలు కాదు కావాల్సింది: పృథ్వీరాజ్
- కావాల్సింది ఇలాంటి కిరీటాలు కాదు..ఆర్థికంగా మెరుగుపడటం
- పైకి బ్రహ్మాండంగా కనపడతాం కానీ, జేబులో డబ్బులుండవు
- పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
చాలా కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారని, ఇలాంటి వాళ్లను ఆదుకుని, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేలా తీసుకు వచ్చేందుకు రాజకీయనాయకులు, సంఘ సంస్కర్తలు పని చేయాలని ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ కోరారు.
‘తెలుగు వన్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఆర్థికంగా వెనుబడిన వాళ్ల పరిస్థితి మెరుగు పడేందుకు రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు కనుక కృషి చేసి విజయం సాధిస్తే, అప్పుడు వారిపై పుస్తకాలు రాయవచ్చు. ప్రజలు కూడా హర్షిస్తారు. అసలు, ముందుగా చాలా కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారు ఎంతమంది ఉన్నారో గుర్తించాలి. ప్రపంచ పోటీల్లో అందాల సుందరులకు పెట్టే కిరీటాల్లాగా.. ‘మీరు కాపు’, ‘మీరు రెడ్డి’, ‘మీరు రాజు’ అనే కిరీటాలు పెడుతున్నారు. ఖద్దరు బట్టలు వేసుకున్నారు కానీ, జేబులో వంద రూపాయలు కూడా ఉండట్లేదు.
‘ఏమండీ, నాయుడు గారు’ అని పిలిస్తే.. ‘నమస్తే అండి’ అనడం, ‘ఒరేయ్, పది కాఫీలు చెప్పు’ అని పురమాయించడం.. కావాల్సింది ఇలాంటి కిరీటాలు కాదు..ఆర్థికంగా మెరుగుపడటం కావాలి. మంచి బట్టలు వేసుకుని పైకి బ్రహ్మాండంగా కనపడతాం కానీ, జేబులో డబ్బులుండని పరిస్థితి మాది. ఇలా, ఆర్థికంగా వెనుకబడిన వాళ్లందరినీ గుర్తించమని కోరుతున్నా.. చదువుకున్న వాడిగా అడుగుతున్నా. వర్గీకరణలను గౌరవిస్తాం, అందరినీ సోదరుల్లా చూద్దాం..ఒక కుటుంబంలా ఉందాం’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.