: ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా అనిల్ కుంబ్లే
భారత లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా నియమితుడయ్యాడు. వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ స్థానంలో కుంబ్లేకు అవకాశం లభించింది. కుంబ్లే అధ్యక్షతన ఐసీసీ క్రికెట్ కమిటీ ఈ నెల 28, 29 తేదీల్లో లండన్ లో సమావేశం కానుంది. కాగా, భారత మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ కు క్రికెట్ కమిటీలో చోటు దక్కింది. శివరామకృష్ణన్ కమిటీలో ఆటగాళ్ళ ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న ఆసీస్ మాజీ క్రికెటర్ టిమ్ మే పదవీకాలం పూర్తవడంతో తప్పుకున్నాడు.
శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కర కూడా క్రికెట్ కమిటీలో ఆటగాళ్ళ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. ఆటకు సంబంధించిన వివిధ ప్రతిపాదనలను, సూచనలను, మార్పులుచేర్పులను ఈ కమిటీ ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డుకు నివేదిస్తుంది.