పోలవరం: 2019 లోపు ‘పోలవరం’ పూర్తి చేయాలనేది మా సంకల్పం: కేంద్ర మంత్రి గడ్కరీ
- ‘పోలవరం’పై గడ్కరీ అధ్యక్షతన ఢిల్లీలో సమీక్ష
- నిధులు, పనులు, కాంట్రాక్టర్ల నుంచి ఎదురవుతున్న సమస్యలపై చర్చ
- కాంట్రాక్టర్ ని మార్చడమనేది పరిపాలనాపరమైన విషయం
- మీడియాతో మంత్రి గడ్కరీ
2019 లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనేదే తమ సంకల్పమని, అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపడుతున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఆయన అధ్యక్షతన ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘పోలవరం’పై పూర్తి స్థాయిలో సమీక్షించామని, నిధులు, ప్రాజెక్టు ప్రాంతంలో జరుగుతున్న పనులు, కాంట్రాక్టర్ల నుంచి ఎదురవుతున్న సమస్యలపై చర్చించామని చెప్పారు.
కాంట్రాక్టర్ ని మార్చడం అనేది పరిపాలనాపరమైన విషయమని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి, అవసరమైతే కాంట్రాక్టరుతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచించారు. కాగా, ఈ సమావేశానికి ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ శాఖ కార్యదర్శి శశిభూషణ్ రావు తదితరులు హాజరయ్యారు.