పరుచూరి గోపాలకృష్ణ: ఎన్టీఆర్ గెటప్ గురించి సమాధానం చెప్పే వరకు అక్కినేని నన్ను వదిలిపెట్టలేదు: పరుచూరి గోపాలకృష్ణ

  • నాడు ఎన్టీఆర్ వివేకానందుడి గెటప్ పై ఏఎన్నార్ నన్ను ప్రశ్నించారు
  • ఆ గెటప్ తో ఎన్టీఆర్ కి వచ్చే ప్రయోజనమేంటన్నారు
  • అక్కినేనితో తన అనుభవాలను పంచుకున్న గోపాలకృష్ణ

నాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ఓసారి వివేకానందుడి గెటప్ వేశారని, ఆ గెటప్ ఎందుకు వేశారో చెప్పమని అక్కినేని నాగేశ్వరరావు తనను అడిగిన విషయాన్ని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. ‘పరుచూరి పలుకులు’ లో ఈ విషయమై ఆయన మాట్లాడుతూ, ‘ ‘మీ అన్న గారు వివేకానందుడి వేషం ఎందుకు వేశారు?’ అని ఓ షూటింగ్ లో అక్కినేని గారు నన్ను అడిగారు. ‘వాళ్లు పొలిటికల్ లీడర్స్..మనకెందుకు సార్, మన పని మనం చేసుకుందాం’ అని నేను అన్నాను.

 ‘కాదు కాదు..ఆ గెటప్ మీ అన్నగారు ఎందుకు వేశారో నీకు తెలుసు చెప్పవా!’ అని అక్కినేని తిరిగి అన్నారు. ‘ఇందిరాగాంధీ గారు కూడా రకరకాల డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు కదా!, అదంతా పొలిటికల్ గేమ్ లో భాగం సార్’ అని సమాధానమిచ్చా. అయినా, నన్ను వదిలిపెట్టని అక్కినేని గారు, ‘వివేకానందుడి గెటప్ వేసుకుంటే ఆయనకు వచ్చే ప్రయోజనం ఏంటి?’ అని ప్రశ్నించారు. ‘సార్, నేను సమాధానం చెప్పే దాకా మీరు నన్ను వదిలిపెట్టరా! ’ అని నవ్వుతూ సమాధానమిచ్చా. ‘ఫర్వాలేదు.. నువ్వు సమాధానం చెప్పగలవు’ అని ఆయన అనడంతో.. ‘పబ్లిసిటీ వస్తుందని అనుకుంటున్నా’ అని అప్పుడు తాను చెప్పానని గోపాలకృష్ణ అన్నారు.

‘పబ్లిసిటీ ఎక్కడ వస్తుంది?’ అని అక్కినేని గారు తన శైలిలో మళ్లీ ప్రశ్నించారు. ‘సార్, ముప్పై ఐదు సంవత్సరాలుగా మీరిద్దరూ.. ‘నువ్వా-నేనా’ అన్నట్టుగా పోరాడుతూ వచ్చారు కదా! అలాంటి మీరు, షూటింగ్ షాట్ ఆపి మరీ, ఈ విషయం కనుక్కోవాలని ఆసక్తి చూపిస్తున్నారంటే, సామాన్యుడికి ఇంకెంత ఆసక్తి ఉంటుంది?’ అని నేను అనడంతో, ‘యువార్ రైట్.. కరెక్టు’ అని అక్కినేని ప్రశంసించారు. అలా అన్నగారు వివేకానందుడి గెటప్ కు సంబంధించి నాతో సమాధానం చెప్పించిన తర్వాతే అక్కినేని నన్ను వదిలిపెట్టారు’ అని గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News