ధన్ రాజ్: తొలి సినిమాకి ఒక్కరోజే అనుకుంటే.. ముప్పై రోజులు పని చేశా!: హాస్యనటుడు ధన్ రాజ్
- నా తొలి చిత్రంలో ముందు ఒక్క సీనే ఇచ్చారు
- ఆ తర్వాత 30 రోజులు పని చేయమన్నారు
- నా నటన బాగుందని పెద్ద వంశీ గారు అవకాశమిచ్చారు
- ఓ ఇంటర్వ్యూలో ధన్ రాజ్
పెద్ద వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నాటి చిత్రం ‘గోపి గోపిక గోదావరి’. ఈ చిత్రం ద్వారా హాస్యనటుడిగా పరిచయమైన ధన్ రాజ్, తన కెరీర్ లో దూసుకువెళ్తున్నాడు. ఈ సందర్భంగా ‘ఐ డ్రీమ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నా మొదటి చిత్రం గోపి గోపిక గోదావరి. ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో నటించే అవకాశం వచ్చింది. ఆ సన్నివేశంలో నటించి ఇంటికి వెళ్లిపోయా.
ఆ తర్వాత ఈ చిత్ర నిర్మాత వల్లూరిపల్లి రమేష్ బాబు గారు ఫోన్ చేసి ‘ఓ ముప్పై రోజులు కావాలి. డేట్స్ ఖాళీగా ఉన్నాయా?’ అని అడిగారు. ‘ఒక్కరోజే అన్నారు కదా సార్, నటించి వచ్చేశాను’ అన్నాను. ‘ఆ క్యారెక్టర్ కాదు.. వేరే క్యారెక్టర్ నీకు ఇస్తున్నాం. యాక్టింగ్ బాగా చేశావని, మెయిన్ కమెడియన్ గా ఇద్దామని వంశీ గారు చెప్పారు’ అని అన్నారు. ఇంత అవకాశం వచ్చిన తర్వాత ఫ్రూవ్ చేసుకోవాలనుకున్నా. నా జీవితంలో మర్చిపోలేని సంతోషకరమైన సంఘటన ఇది’ అని తన తొలి సినిమా గురించి ధన్ రాజ్ చెప్పుకొచ్చాడు.