YSRCP: వైసీపీ కార్యాలయంలో కుర్చీలు విసురుకున్న నేతలు.. అనంతలో మరోసారి బయటపడ్డ విభేదాలు
- అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అలజడి
- గుర్నాథ్ రెడ్డిని వైసీపీ నుంచి బయటకు పంపే యత్నం చేస్తున్నారని నినాదాలు
- ఎంపీ మిథున్ రెడ్డి వర్గీయులపై గుర్నాథ్ రెడ్డి వర్గీయుల ఫైర్
అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు బాహాబాహీకి దిగారు. రెండు వర్గాలుగా ఉన్న ఆ జిల్లా వైసీపీ నేతల్లో ఒక వర్గం మరింత రెచ్చిపోయి కార్యాలయంలోని కుర్చీలను విసిరిపడేసింది. దీంతో తీవ్ర అలజడి చెలరేగింది. ఈ విషయాన్ని తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమావేశానికి అందరినీ పిలవకుండా కొంత మందినే పిలిచారని వైసీపీ నేత గుర్నాథరెడ్డి వర్గం నేతలు నినాదాలు చేశారు.
ఎంపీ మిథున్ రెడ్డి వర్గీయుల తీరుకు నిరసన తెలిపినట్లు తెలుస్తోంది. కుట్ర చేసి గుర్నాథ్ రెడ్డిని వైసీపీ నుంచి బయటకు పంపే యత్నం చేస్తున్నారని వారు అన్నారు. ఇరువర్గాల మధ్య విభేదాలు రావడంతో ఈ గొడవ చెలరేగిందని పోలీసులు తెలిపారు. గుర్నాథ్ రెడ్డి వైసీపీని వీడుతారని కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.