తనికెళ్ల భరణి: అలా అయితే, తెలుగు వాళ్లమని చెప్పుకోవడం మానేయండి!: తనికెళ్ల భరణి
- పది పుస్తకాలు పడేసి గడిపెయ్యమంటే గడిపేస్తాను
- ఆ స్థితిని దయచేసి, యువత డెవలప్ చేసుకోవాలి
- ‘ట్విట్టర్’లో తనికెళ్ల భరణి వీడియో
ఆక్సిజన్ లేకపోయినా బతకగలనేమో గానీ, పుస్తకాలు లేకపోతే మాత్రం బతకలేనేమోనని అనిపిస్తుంటుందని ప్రముఖ నటుడు, మాటల రచయిత తనికెళ్ల భరణి అన్నారు. తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ, ‘పుస్తకం మంచి స్నేహితుడు అనే నానుడి ఉంది. పది పుస్తకాలు పడేసి గడిపెయ్యమంటే గడిపేస్తాను. ఆ స్థితిని దయచేసి, యువత డెవలప్ చేసుకోవాలి. పూర్వం మన ఇళ్లల్లో భారత, భాగవతాలు చదువుతుండేవారు .. వింటుండేవారు.
టైంపాస్ కోసం, భక్తి కోసం, జీవన విధానం కోసం ... కావ్యాలు చదివేవారు. పూర్వం .. కనీసం 10 నుంచి 100 పద్యాలు రాని తెలుగు ఇల్లు ఉండేది కాదు. పోతన భాగవతం .. ద్రాక్షపాకం. ఆ పద్యాలు చదువుతుంటే తనివి తీరదు. పోతన పద్యాలు కనీసం 10 అయినా రాకపోతే తెలుగువాళ్లమని చెప్పుకోవడం మానేయండి! కనీసం, ఆ పద్యాలను ముట్టుకోండి, పుణ్యం వస్తుందని నా ఉద్దేశం. పోతన భాగవతం .. ఆధ్యాత్మికం, రసాత్మకం. ఈ రెండింటీకి ఉపయోగపడుతుంది. పోతన భాగవతం చదివితే దైవం సాక్షాత్కారం అయిపోతుంది’ అని భరణి అభిప్రాయపడ్డారు.