జగన్: నిరుద్యోగులు అధైర్యపడొద్దు.. ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం: జగన్
- ప్రత్యేక హోదా రాకపోవడం వల్లే నిరుద్యోగుల ఆత్మహత్యలు
- ప్రభుత్వం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు
- అందరం పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందాం
అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన నవీన్ (23) అనే విద్యార్థి తాను బీటెక్ చదివినప్పటికీ ఉద్యోగం రాలేదని పేర్కొంటూ నిన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు ఇదే కారణంతో ఎమ్మెస్సీ, బీఈడీ చదివిన విశాఖపట్నంలోని పాయకరావుపేట మండలం మంగవరం గ్రామ వాసి శ్రీను (28) పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించారు.
నిరుద్యోగుల ఆత్మహత్యలు బాధాకరమని జగన్ పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ చేయలేకపోతున్న ప్రభుత్వం మరోవైపు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను కేంద్రం ముందు తాకట్టు పెట్టడంతోనే ఇక్కడ పరిశ్రమలు, పెట్టుబడులు రాక నిరుద్యోగంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. అందరం పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందామని పిలుపునిచ్చారు.