శ్రీశైలం ప్రాజెక్టు: నిండు కుండలా శ్రీశైలం జలాశయం.. రేపు ఉదయం తెరుచుకోనున్న గేట్లు
- చీఫ్ ఇంజనీర్ నారాయణరెడ్డి వెల్లడి
- అప్రమత్తంగా ఉండాలని దిగువ ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక
- డ్యాం పరిసరాల్లో సందర్శకుల తాకిడి..ఆంక్షలు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు పోటెత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. నిండు కుండలా మారింది. శ్రీశైలం జలాశయం గేట్లను రేపు ఉదయం ఎత్తి నీటిని విడుదల చేయనున్నట్టు చీఫ్ ఇంజనీర్ నారాయణరెడ్డి తెలిపారు. రేపు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య నీటిని విడుదల చేయనున్నట్టు చెప్పారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డ్యాం పరిసరాల్లోకి వెళ్లొద్దని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించినట్టు తెలుస్తోంది. సందర్శకుల తాకిడి ఎక్కువ కావడంతో డ్యాం పరిసరాల్లో ఆంక్షలు విధించారు. శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.
కాగా, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, తుంగభద్ర జలాశయాల నుంచి వస్తున్న వరద నీటి మట్టం అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండిపోయింది. ఇప్పటికే శ్రీశైలం జలాశయానికి 1,47,347 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. 88,559 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.40 అడుగులకు చేరింది.