రఘువీరారెడ్డి: అమిత్ షా కుమారుడి ఆస్తుల విషయంపై.. ఏపీసీసీ అధ్య‌క్షుడి ఆధ్వర్యంలో విజయవాడలో ర్యాలీ

  • విజ‌య‌వాడలోని ఐవీ ప్యాలెస్ నుంచి ఆంధ్ర హాస్పిట‌ల్ కూడ‌లి వ‌ర‌కు ర్యాలీ
  • మోదీకి అమిత్‌షా బినామీ అని రఘువీరారెడ్డి ఆరోపణలు
  • బీజేపీ నీతి ఏమిటి? అమిత్‌షాను బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గించాలి
  • వెంటనే విచారణ జరిపించాలి

బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా కొడుకు జై షాకు చెందిన టెంపుల్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీ ఆస్తులు ఇంత‌గా ఎలా పెరిగిపోయాయంటూ కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ నిర‌స‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఏపీసీసీ అధ్యక్షుడు ర‌ఘువీరారెడ్డి ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడలోని ఐవీ ప్యాలెస్ నుంచి ఆంధ్ర హాస్పిట‌ల్ కూడ‌లి వ‌ర‌కు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ర్యాలీ నిర్వ‌హించారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాక ముందు కేవలం వేల రూపాయ‌లు టర్నోవర్ ఉన్న ఆ కంపెనీ.. బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కోట్ల ట‌ర్నోవ‌ర్ ఎలా సాధించింద‌ని రఘువీరారెడ్డి ప్ర‌శ్నించారు. మోదీకి అమిత్‌షా బినామీ అని ర‌ఘువీరారెడ్డి ఆరోపించారు. అందుకే అమిత్‌షా కుమారుడు ఎంత అవినీతిలో కూరుకున్నా ప్ర‌ధాని ప‌ట్టన‌ట్లు ఉన్నారని ఆరోపించారు. బీజేపీ నీతి ఏమిట‌ని ప్ర‌శ్నించారు.

బీజేపీ నేత‌లంద‌రూ పెద్ద నోట్ల‌ను మార్చుకున్నారని రఘువీరారెడ్డి ఆరోపించారు. బీజేపీకి ఏ మాత్రం నిజాయతీ ఉన్నా అమిత్‌షాను బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గించి, వెంట‌నే విచార‌ణ జరిపించాలని డిమాండ్ చేశారు. ది వైర్ అనే వెబ్‌సైట్ ఈ విష‌యాన్ని బయట పెడితే దీనిపై విచారణ వేయకుండా మోదీ ప్రభుత్వం ఎదురు దాడి చేస్తోందని  అన్నారు. అంతేగాక‌, వార్త రాసిన వెబ్ సైట్ పైన రూ.100 కోట్లకు పరువు నష్టం దావా అంటూ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని వ్యాఖ్యానించారు.

మోదీ మాట్లాడే మాట‌లు, చేసే చేత‌లు పూర్తి భిన్నంగా ఉన్నాయ‌ని రఘువీరారెడ్డి అన్నారు. గత ఏడాది కూడా నోట్ల ర‌ద్దులో బాగా డ‌బ్బులు దండుకున్నారని చెప్పారు. చ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో అనేక కుంభకోణాలు బయటపడ్డాయని, అయినా విచారణలు జ‌రిపించ‌లేద‌ని చెప్పారు. స్వయంగా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు అవినీతి ఊబిలో ఉన్నార‌ని ఆరోప‌ణ‌లు చేశారు. చివ‌రికి పోల‌వ‌రం ప్రాజెక్టును కూడా వారి స్వార్థం కోసం, సంపాద‌న కోసం వాడుకుంటున్నార‌ని అన్నారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుతో కుమ్మ‌క్కయ్యి, అవినీతికి పాల్ప‌డి ఆ ప్రాజెక్టుని నీరు కారుస్తున్నారని చెప్పారు. వీట‌న్నింటిపైనా తాము ఎంక్వ‌యిరీ కోరుతున్నామ‌ని వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News