హైదరాబాద్: మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి కేటీఆర్

  • హైదరాబాద్ లో వర్షాలపై కేటీఆర్ సమీక్ష
  • ఫిర్యాదులపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు 
  • ఎమర్జెన్సీ బృందాల నిరంతర సహాయక చర్యలు

హైదరాబాద్ లో నిన్నటి వర్ష బీభత్సానికి నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రోడ్లపై వర్షపు నీరు చేరి ట్రాఫిక్ స్తంభించిపోవడం, పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరడం, నాలాలు పొంగిపొర్లడంతో నగర వాసులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. అయితే, గోడ కూలి ఇద్దరు వ్యక్తులు, విద్యుత్ వైర్ తెగి పడి మరో వ్యక్తి మృతి చెందారు. ఆయా సంఘటనల్లో మృతులకు మంత్రి కేటీఆర్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గోడ కూలి మృతి చెందిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, కరెంట్ షాక్ తగిలి చనిపోయిన వ్యక్తికి రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.

కాగా, హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. సీసీటీవీలు, డయల్ 100, జీహెచ్ఎంసీ కాల్ సెంటర్, మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని, వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాటర్ వర్క్స్ అధికారులు, 140 మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నాయని అన్నారు.  

  • Loading...

More Telugu News