అమేథీ: రాహుల్ జీ! భద్రత కల్పించలేము..మీ పర్యటన వాయిదా వేసుకోండి: అమేథీ అధికారులు
- మొహర్రం, దుర్గామాత నిమజ్జనం నిమిత్తం పలు ప్రాంతాలకు పోలీసులను తరలించాం
- రాహుల్ కు లేఖ రాసిన అధికారులు
‘రాహుల్ జీ! మీకు భద్రత కల్పించలేము..మీ పర్యటన వాయిదా వేసుకోండి’ అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి యూపీలోని అమేథీ జిల్లా అధికారులు విన్నవించారు. ఈ నెల 4న తన సొంత నియోజకవర్గమైన అమేథీలో రాహుల్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ పర్యటనకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాహుల్ కు భద్రత కల్పించే విషయమై ఆ పార్టీ నేతలు జిల్లా అధికారులను కలిశారు. మొహర్రం పండగ, దుర్గామాత నిమజ్జన కార్యక్రమం నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూసేందుకు పోలీసులను వేర్వేరు ప్రాంతాలకు తరలించామని, భద్రత కల్పించడం ప్రస్తుతం కుదరదని అధికారులు చెప్పారు. పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరుతూ రాహుల్ కు అధికారులు ఓ లేఖ రాశారు. కాగా, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ కనిపించడం లేదంటూ ఆ నియోజకవర్గ ప్రజలు గతంలో పోస్టర్లు అతికించారు.