బెంగళూరు: సెల్ఫీ మోజులో పడి.. చెరువులో మునిగిపోతున్న మిత్రుడిని గుర్తించలేకపోయారు!

 * బెంగళూరు నగర శివారులో విషాదం 

 * చెరువులో స్నానాలు చేస్తూ సెల్ఫీ దిగిన విద్యార్థులు

 * మునిగిపోతున్న తోటి మిత్రుడిని గుర్తించని వైనం


సెల్ఫీ మోజులో పడి చెరువులో మునిగిపోతున్న తమ స్నేహితుడిని విద్యార్థులు గుర్తించలేకపోయిన విషాద సంఘటన బెంగళూరులో జరిగింది. స్థానిక నేషనల్ కాలేజ్ కు చెందిన సుమారు పదకొండు మంది విద్యార్థులు బెంగళూరు నగర శివారులోని ఓ చెరువు వద్దకు నిన్న వెళ్లారు. ఆ చెరువులో స్నానం చేశారు. అనంతరం, సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత పక్కనే ఉన్న గుడికి వెళ్లారు. అప్పుడు గానీ, వారికి అసలు విషయం అర్థం కాలేదు... తమ గ్రూప్ లోని విశ్వాస్ (17) అనే విద్యార్థి మిస్సయ్యాడని!

 విశ్వాస్ కనపడకపోవడంతో కంగారు పడిన తోటి విద్యార్థులు, చెరువులో దిగిన సెల్ఫీలు చూస్తుండగా విశ్వాస్ మునిగిపోతున్న ఓ ఫొటోను గుర్తించారు. వెంటనే, పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని వారి దృష్టికి తెచ్చారు. ఆ చెరువులో గాలించిన అనంతరం విశ్వాస్ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. కాగా, విశ్వాస్ మృతిపై అతని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ అతని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై విచారణ చేపడతామని కాలేజీ యాజమాన్యం చెప్పడంతో వారు తమ ఆందోళనను విరమించారు.

  • Loading...

More Telugu News