విజయవాడ: ఎస్‌బీఐ శాఖలోని బంగారం మణప్పురంలో తాకట్టు.. విజయవాడలో భారీ మోసం వెలుగులోకి!
- విజయవాడలోని గాయత్రినగర్ ఎస్‌బీఐలో కుంభకోణం
- ఖాతాదారులు బ్యాంకులో ఉంచిన బంగారు నగలను తాకట్టు పెట్టిన ఉద్యోగి
- మూడు కోట్ల రూపాయల రుణం తీసుకున్న ఎస్‌బీఐ ఉద్యోగి
- మాచవరం మణప్పురం కార్యాలయంలో తనిఖీలు
విజయవాడలోని గాయత్రినగర్ ఎస్‌బీఐలో బంగారు నగల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఖాతాదారులు తమ బ్యాంకులో ఉంచిన బంగారు నగలను మాచవరంలోని మణప్పురంలో తాకట్టు పెట్టి ఎస్‌బీఐ ఉద్యోగి కృష్ణచైతన్య రుణం తీసుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన బ్యాంకు అధికారులు ఇటీవల సీఐడీకి ఫిర్యాదు చేయడంతో వారు మణప్పురం గోల్డ్ లోన్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు.
దీంతో కృష్ణ చైతన్య చేసిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఖాతాదారుల నగలు తాకట్టు పెట్టి కృష్ణ చైతన్య ఏకంగా మూడు కోట్ల రూపాయల రుణం తీసుకున్నాడని సీఐడీ అధికారులు తేల్చారు. మణప్పురంకు చెందిన ఇతర శాఖల్లోనూ తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. మాచవరం మణప్పురం కార్యాలయంలో కృష్ణ చైతన్య ఏకంగా 10 కిలోల బంగారం తాకట్టు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. కృష్ణచైతన్యతో పాటు మణప్పురం సిబ్బందిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.