ఇంటర్ విద్యార్థిని: విజయవాడలో బైక్‌లపై వచ్చి ఇంటర్ విద్యార్థినిని అడ్డగించిన యువకులు.. బ్లేడ్లతో దాడిచేస్తామన్న వైనం!
విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో ఈ రోజు కలకలం చెలరేగింది. రెండు బైక్‌లపై వచ్చిన ఐదుగురు యువకులు కాలేజీ నుంచి ఇంటికి వెళుతున్న ఓ ఇంటర్ విద్యార్థినిని అడ్డగించారు. తమ బైక్ ఎక్కాలని, లేదంటే బ్లేడ్లతో దాడి చేస్తామని బెదిరించి, దాడి చేయబోయారు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక మహిళ ఆ అమ్మాయిపై జరుగుతున్న దాడిని అడ్డుకుంది.
దాంతో ఆ విద్యార్థిని ఆ దుండగుల బారి నుంచి తప్పించుకుని తన ఇంటికి వెళ్లింది. ఈ ఘటనపై పటమట పోలీస్‌స్టేషనులో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు జరుపుతున్నారు.