: లండన్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వేర్వేరు ప్రదర్శనలివ్వనున్న ఏఆర్ రెహమాన్!
త్వరలో కెనడాలోని టొరంటోలో హిందీ, తమిళం రెండు భాషల్లో వేర్వేరుగా ప్రదర్శనలివ్వనున్నట్లు స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ప్రకటించారు. గత జూలైలో లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో ఏఆర్ రెహమాన్ ఇచ్చిన ప్రదర్శనలో ఎక్కువ తమిళ పాటలు పాడటంపై హిందీ భాషాభిమానులు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
నిజానికి అది తమిళులు నిర్వహించిన వేడుకే కావడంతో ఆయన ఆ భాష పాటలు ఎక్కువగా పాడారని, ఈ విషయాన్ని ప్రకటన పోస్టర్లలో ప్రస్తావించినప్పటికీ హిందీ అభిమానులు టికెట్లు కొన్నారని, ప్రదర్శన తర్వాత ఇలా వ్యతిరేకత తెలియజేయడం సబబు కాదని చర్చలు, వాదోపవాదాలు చాలా జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఒకే వేదిక మీద వరుసగా రెండ్రోజులు.. ఒకరోజు హిందీ పాటలు, మరుసటి రోజు తమిళ పాటలు పాడుతూ ప్రదర్శనలిచ్చేందుకు రెహమాన్ నిర్ణయించుకొని ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రదర్శనలకు సంబంధించిన ప్రకటన పోస్టర్లను రెహమాన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్లలో హిందీ, తమిళ్ పదాలను పెద్దగా స్పష్టంగా రాయడం చూడొచ్చు.