: మరణించిన మానవత్వం... బతికించమని ముప్పావుగంట ప్రాధేయపడినా ఎవరూ వినలేదు!

  • ఫోటోలు, వీడియోలు తీసుకుని వెళ్లిపోయిన ఎంతో మంది
  • బంధువు వచ్చేంత వరకూ నడిరోడ్డుపై రక్తపు మరకల మధ్య యువతి
  • నవంబర్ 13న పెళ్లి - అంతలోనే విషాదం
  • చండీగఢ్ లో ఘటన - జరిగింది చెబుతూ కనుమూసిన అమన్

మానవత్వం నడి రోడ్డుపై మరణించింది. నవంబర్ 13న పెళ్లి కావాల్సిన ఓ యువతి, తన స్నేహితురాలితో కలసి స్కూటీపై ఆఫీసుకు వెళుతూ ప్రమాదానికి గురై సుమారు 45 నిమిషాల పాటు ప్రాణాలతో పోరాడుతూ, తనను కాపాడాలని వేడుకుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఆమె బంధువు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి ఆమె మరణించింది. ఈ ఘటన చండీగఢ్ లో జరిగింది. కాపాడమని ఆమె వేడుకుంటుంటే, దాన్నో వేడుకలా చూస్తూ ఫోటోలు, వీడియోలు తీసుకున్నారే తప్ప ఎవరూ స్పందించలేదని, మరణించే ముందు ఆమె చెప్పడం గమనార్హం.

మరిన్ని వివరాల్లోకి వెళితే, అమన్ దీప్ కౌర్ (25) అనే యువతికి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఈనెల 13న వివాహం కూడా నిశ్చయమైంది. జిరాక్ పూర్ లో పేయింగ్ గెస్టుగా ఉంటున్న ఆమె, రోజులానే తన ఆఫీస్ కు స్నేహితురాలు సోఫియాతో కలసి బయలుదేరగా, వేగంగా వచ్చిన ఓ లారీ వారిని ఢీకొంది. స్నేహితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. అమన్ నడుము కింది భాగం పూర్తిగా దెబ్బతినగా, ఆమె నడిరోడ్డుపై రక్తపు మరకల మధ్య 45 నిమిషాలు బతికే ఉంది. తనను ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని వేడుకుంది. చివరికి యదువీందర్ సింగ్ అనే ఆమె బంధువు వచ్చి ఆసుపత్రికి తీసుకెళుతుంటే, తన తండ్రితో మాట్లాడాలని, ఒక్కసారి ఫోన్ చేయాలని కోరింది. తనను చూసిన వాళ్లంతా కనీస మానవత్వం చూపకుండా, ఫోటోలు, వీడియోలు తీసుకున్నారని చెబుతూ ఆయన చేతుల్లోనే కన్నుమూసింది. రెండు నెలల్లో పెళ్లి కావలసిన తమ కుమార్తె ఇలా అర్థంతరంగా కన్నుమూయడంతో వారి ఇంట తీవ్ర విషాదం అలముకుంది.

  • Loading...

More Telugu News