: అరబ్ కుటుంబానికి బానిసగా పంజాబీ మహిళ... రూ. 3.5 లక్షలకు అమ్మేశారు!

  • పోలీసుల అదుపులో ట్రావెల్ ఏజంట్ 
  • సౌదీ వెళ్లిన తరువాతే 'అమ్మకం' వెలుగులోకి
  • రూపాయి జీతమివ్వని అరబ్ కుటుంబం
  • వెనక్కు పంపాలంటే మూడున్నర లక్షలు ఇవ్వాలని డిమాండ్

పంజాబ్ లోని ఓ మహిళను సౌదీ అరేబియా కుటుంబానికి బానిసగా అమ్మేశాడో ట్రావెల్ ఏజంట్. రూ. 3.5 లక్షలకు జలంధర్ సమీపంలోని గోర్సియాన్ గ్రామానికి చెందిన పరమ్ జీత్ కౌర్ (39)కు మోస పూరిత మాటలు చెప్పిన ట్రావెల్ ఏజంట్ రేషమ్ భట్టీ, ఉద్యోగం పేరిట ఆశలు చూపి ఆమెను బానిసగా అమ్మేశాడని పోలీసులు తెలిపారు. పరమ్ జీత్ భర్త మల్కియత్ రామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రేషమ్ ను అరెస్ట్ చేశామని, హ్యూమన్ ట్రాఫికింగ్ చట్టాల ప్రకారం కేసులు పెట్టామని తెలిపారు.

 తాను రోజు కూలీగా పనిచేస్తున్నానని, సంపాదించే డబ్బు చాలక సౌదీలో ఏదైనా పని ఇప్పించాలని రేషమ్ కార్యాలయానికి వెళితే, ఆమెను గత జూలై 23న సౌదీకి పంపారని తెలిపాడు. అక్కడికి వెళ్లిన తరువాత తన భార్యకు రూపాయి కూడా వేతనం ఇవ్వలేదని, అడిగితే, వారు ఆమెను బానిసగా కొనుగోలు చేసినట్టు సమాధానం వచ్చిందని చెప్పాడు. ఆమెను వదిలి వేయాలంటే మొత్తం డబ్బూ ఇవ్వాల్సిందేనని అరబ్ కుటుంబం డిమాండ్ చేస్తోందని తెలిపాడు. తన భార్యను తిరిగి ఇండియా చేర్చే దిశగా ప్రభుత్వం కల్పించుకోవాలని కోరాడు. ఈ కేసులో రేషమ్ ఓ సబ్ ఏజంట్ మాత్రమేనని తాము అనుమానిస్తున్నామని, కొందరు హ్యూమన్ ట్రాఫికర్ల ముఠా ఈ పని చేసి వుండవచ్చని పోలీసులు తెలిపారు. వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News