: నన్ను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి.. అయినా భయపడను!: సినీనటుడు కమలహాసన్
తనను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, అయితే వాటికి బెదిరిపోయే వ్యక్తిని కానని ప్రముఖ సినీనటుడు కమల హాసన్ అన్నారు. తాను కొత్త పార్టీ పెట్టే తీరుతానని, ఇతర ఏ పార్టీలోనూ చేరబోనని తెలిపారు. తమిళనాడులో ఈ ఏడాది నవంబర్‌లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని కమల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... దేశంలో మార్పు అవసరమని ఆ మార్పు తనతోనే, తమిళనాడు నుంచే రావాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు.
ప్రతి పార్టీకీ ఒక సిద్ధాంతం ఉంటుందని కమల హాసన్ అన్నారు. తన జీవితంలో చాలా మంది రాజకీయ పార్టీల నేతలను కలుసుకున్నానని, వారితో ఫొటోలు దిగానని చెప్పారు. అయినప్పటికీ తాను ఏ పార్టీ సిద్ధాంతాలకు లోబడలేదని చెప్పారు. తన ఆశయాలు, ఆలోచనలకు అనువుగా ఏ ఒక్క పార్టీ ఉన్నట్లుగా తనకు అనిపించలేదని చెప్పారు. శశికళను తొలగించడం, అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించడం మంచి పరిణామమని అన్నారు. దేశంలో రాజకీయ వ్యవస్థ దెబ్బతినిపోయిందని అన్నారు. 'ఐదేళ్లకు ఒకసారి ఓటు వేయడం కాకుండా, నాయకులు ఓట్ల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వెంటనే వారిని తొలగించగలిగే రాజకీయ వ్యవస్థ మనకు కావాలి' అన్నారు. భారత రాజకీయాల్లో మార్పు తీసుకురావాలంటే తాను చెబుతోన్న ఐడియానే మంచి మార్గమని హితవు పలికారు.