: ర్యాన్ స్కూల్‌లో మరణించిన విద్యార్థి తండ్రి ఇంటర్వ్యూ కోసం దెబ్బలాడుకున్న మీడియా ప్రతినిధులు... వీడియో చూడండి!
సంచలనం కోసం మీడియా ఎలాంటి సంఘటననైనా వాడుకుంటుందనడానికి మరో నిదర్శనం ఇది. కుమారుడు ప్రద్యుమన్ హత్యకు గురై బాధలో ఉన్న అతని తండ్రి వరుణ్ ఠాకూర్ మొదటి ఇంటర్వ్యూ కోసం ఇద్దరు మహిళా మీడియా ప్రతినిధులు దెబ్బలాడుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వారిద్దరూ జాతీయ మీడియా టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ ఛానళ్లకు చెందిన వారుగా తెలిసింది.
లైవ్‌లో మాట్లాడుతున్న వరుణ్ ఠాకూర్ మైక్‌ను రిపబ్లిక్ టీవీ ప్రతినిధి లాగేయడం వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. వరుణ్ ఠాకూర్ లైవ్ ఇంటర్వ్యూ కోసం ఈ మీడియా ఛానళ్ల ప్రతినిధులు దెబ్బలాడుకుంటుండగా టైమ్స్ నౌ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. నిజానికి వరుణ్ ఠాకూర్ ముందు తమకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నాడని, మధ్యలో రిపబ్లిక్ టీవీ వచ్చి అడ్డుకుందని టైమ్స్ నౌ తెలిపింది. ప్రముఖ న్యూస్ అనలిస్ట్ అర్నబ్ గోస్వామి టైమ్స్ నౌ నుంచి విడిపోయి రిపబ్లిక్ టీవీ పెట్టిన సంగతి తెలిసిందే.