: ఐఫోన్ ఎక్స్ ఆవిష్కరణ వేడుకలో ఫేస్ ఐడీ సరిగానే పనిచేసింది... స్పష్టం చేసిన ఆపిల్
ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో ప్రతిష్టాత్మకంగా విడుదలైన ఆపిల్ ఐఫోన్ ఎక్స్ ఆవిష్కరణ వేడుకలో జరిగిన తప్పిదం గురించి ఆపిల్ సంస్థ సంజాయిషీ ఇచ్చింది. ఫేస్ ఐడీ డెమోలో ఆపిల్ వైస్ ప్రెసిడెంట్ క్రెయిగ్ ఫెడరిగీ ముఖాన్ని గుర్తించడంలో ఐఫోన్ ఎక్స్ విఫలమైందని వచ్చిన వార్తలను ఆపిల్ ఖండించింది. ఫేస్ ఐడీ టెక్నాలజీ సరిగానే పనిచేసిందని ప్రకటించింది.
కార్యక్రమం ప్రారంభమవడానికి ముందు అవిష్కరణ వేడుకలో ఉపయోగించిన ఐఫోన్ ఎక్స్‌తో చాలా మంది తమ ముఖాలను గుర్తిస్తుందా? లేదా? అని పరీక్షించుకున్నారని, అందుకే క్రెయిగ్ ప్రయత్నించినపుడు సెక్యూరిటీ ప్రోగ్రామింగ్‌లో భాగంగా పిన్ కోడ్ అడిగిందని ఆపిల్ వివరణ ఇచ్చింది. ఎక్కువ సార్లు ఫేస్ ఐడీ ఫీచర్‌ను పరీక్షిస్తే, రక్షణ కోసం అన్‌లాక్ పిన్ అడిగేలా ఐఫోన్ ఎక్స్‌ను ప్రోగ్రాం చేసినట్లు ఆపిల్ తెలిపింది.