: నార్మన్ ఫోస్టర్స్ అందించిన భవనాల డిజైన్లపై చంద్రబాబు అసంతృప్తి.. దర్శకుడు రాజమౌళిని లండన్ పంపాలంటూ సూచన!
ఏపీ రాజధాని అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న భవనాల తుది డిజైన్లను నార్మన్ ఫోస్టర్స్ సంస్థ అందించింది. దీనిపై ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవన ఆకృతుల్లోని కొన్ని అంశాలు బాగున్నాయని... అయితే, బాహ్య రూపం మాత్రం చూడముచ్చటగా లేదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. డిజైన్లను రూపొందించడానికి మరికొంత సమయం తీసుకోవాలని ఈ సందర్భంగా నార్మన్ ఫోస్టర్స్ బృందానికి ఆయన సూచించారు. కొంచెం సమయం తీసుకుని అద్భుతమైన డిజైన్లను రూపొందించాలని చెప్పారు.
ప్రస్తుతం పనిచేస్తున్న ఆర్కిటెక్ట్ లతో పాటు రాష్ట్రంలోని అత్యున్నత అర్కిటెక్ట్ లతో ఓ టీమ్ ను తయారు చేయాలని మంత్రులకు ఆయన సూచించారు. టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళితో వెంటనే సంప్రదింపులు జరపాలని సీఆర్డీఏ కమిషనర్ ను ఆదేశించారు. అవసరమైతే నార్మన్ ఫోస్టర్స్ బృందంతో పాటు రాజమౌళిని లండన్ పంపించాలని చెప్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ 10 భవనాలను స్ఫూర్తిగా తీసుకుని డిజైన్లను రూపొందించాలని సూచించారు. అక్టోబర్ 25న తాను స్వయంగా లండన్ వెళ్లి నార్మన్ ఫోస్టర్స్ కార్యాలయాన్ని సందర్శిస్తానని... వారు రూపొందించే ఆకృతులను అక్కడే పరిశీలిస్తానని తెలిపారు.