: యాడ్ ఫిల్మ్ షూటింగ్ కి వెళ్లిన సహాయకురాలి అదృశ్యం!
యాడ్ ఫిల్మ్ దర్శకుడు కమల్ సేతు వద్ద సహాయకురాలిగా పని చేస్తున్న యువతి షణ్ముఖ ప్రియ (18) అదృశ్యమైన సంఘటనపై వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు..హైదరాబాద్ లోని విజయ్ నగర్ కాలనీకి చెందిన కోటేశ్వరరావు కుమార్తె షణ్ముఖ ప్రియ. ఇంటర్ పూర్తి చేసిన ఆమె, కమల్ సేతు వద్ద సహాయకురాలిగా పనిచేస్తోంది. డార్జిలింగ్ లో షూటింగ్ కు వెళ్లాలని చెప్పడంతో గత నెల 17న షణ్ముఖ ప్రియను ఆమె తల్లి ఉషాకుమారి శంషాబాద్ విమానాశ్రయంలో దిగబెట్టి వచ్చింది.
అదే రోజు మధ్యాహ్నం తన తల్లికి ఫోన్ చేసిన షణ్ముఖ ప్రియ కోల్ కతాకు చేరుకున్నానని, ఆగస్టు 28న తిరిగి వస్తానని చెప్పింది. అయితే ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా షణ్ముఖ ప్రియ స్పందించకపోగా, ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో, ఆందోళన చెందిన ఆమె కుటుంబసభ్యలు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (ఆర్జీఐ ఏ) పోలీసులకు నిన్న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువకులపై షణ్ముఖ ప్రియ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.