: విదేశాల్లో రూ. 4 లక్షల కోట్ల బ్లాక్ మనీ... స్విస్ వైపు వెళ్లట్లేదు: తాజా నివేదిక
విదేశాల్లో అక్రమంగా డబ్బును దాచుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, 2007తో పోలిస్తే 2015 నాటికి విదేశాల్లో అక్రమ నగదు నిల్వలు 90 శాతానికి పైగా పెరిగి రూ. 4 లక్షల కోట్లకు చేరుకున్నాయని, ఇది దేశ స్ధూల జాతీయోత్పత్తిలో 3.1 శాతానికి సమానమని తాజా నివేదిక ఒకటి తెలిపింది. అయితే, అత్యధికులు నమ్ముతున్నట్టు స్విట్జర్లాండ్ లో భారత నల్లధనం అధికంగా లేదని, 53 శాతానికి పైగా భారతీయులు తాము దాచుకునే నల్లధనాన్ని హాంకాంగ్, మకావు, సింగపూర్, బహరైన్, మలేషియా వంటి ఆసియా దేశాల్లో దాస్తున్నారని బాసెల్ కేంద్రంగా పని చేస్తున్న బీఐఎస్ (బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్ మెంట్స్) ఓ రిపోర్టులో పేర్కొంది.
2007లో 58 శాతం భారత నల్లధనం స్విస్ బ్యాంకుల్లో ఉండగా, 2015 నాటికి అది 31 శాతానికి ఆపై మరింతగా తగ్గిందని పేర్కొంది. ఇక ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకూ గణాంకాలను పరిశీలిస్తే, వివిధ దేశాల్లోని వారు మొత్తం 8.6 ట్రిలియన్ డాలర్లను విదేశాల్లో దాచుకున్నారని, వాటిల్లో 81 శాతం పోర్ట్ ఫోలియో సెక్యూరిటీస్ రూపంలోను, 19 శాతం బ్యాంకు డిపాజిట్ల రూపంలోను ఉందని, ఇది ప్రపంచ జీడీపీలో 11.6 శాతానికి సమానమని పేర్కొంది. ఇక ఆసియా దేశాల్లో 53 శాతం, స్విస్ లో 31 శాతం, కరేబియన్ దేశాల్లో 4 శాతం, యూరప్ లో (స్విస్ మినహా) 14 దేశాల్లో నల్లధనం దాగుందని యూసీఎల్ఏ ఎకానమిస్ట్ గాబ్రియేల్ జుచ్ మన్ తయారు చేసిన అధ్యయనం పేర్కొంది.