: నవంబర్ 3న భారత్ మార్కెట్లోకి ఆపిల్ ఐఫోన్ ఎక్స్... ప్రారంభ ధర రూ. 89,000!
ఫేస్ రికగ్నిషన్, సూపర్ రెటీనా డిస్ప్లే వంటి ఫీచర్లతో ప్రతిష్టాత్మకంగా విడుదలైన ఆపిల్ ఐఫోన్ ఎక్స్ నవంబర్ 3న భారత మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. 64జీబీ, 256జీబీ మోడళ్లలో ఉన్న దీని ప్రారంభ ధర రూ. 89,000గా ఉంటుందని ఆపిల్ ఇండియా ప్రకటించింది. అలాగే ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లు సెప్టెంబర్ 29 నుంచి భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది.
64జీబీ, 256 జీబీ వేరియంట్స్‌లో విడుదల కానున్న వీటి ధర రూ. 64,000 నుంచి ప్రారంభం కానుంది. భారత స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో 2.3 శాతం ఆపిల్ ఆక్రమించినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా ఆపిల్‌కి గట్టిపోటీనిస్తున్న శాంసంగ్ ఇప్పటికే భారత మార్కెట్లోకి తమ గెలాక్సీ నోట్8 స్మార్ట్‌ఫోన్ తీసుకువచ్చే సన్నాహాలు ముమ్మరం చేసింది. ఐఫోన్ 8 కంటే ముందే (సెప్టెంబర్ 25) నోట్8 భారత్‌లోకి రానుంది. దీని ధర రూ. 67,900.