: ప్రియురాలితో కలసి కన్న కొడుకునే కిడ్నాప్ చేసిన నటుడు!


భార్య నుంచి విడిపోయిన ఓ భోజ్ పురి నటుడు, ఆమెకు గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో సొంత కుమారుడిని ప్రియురాలి సాయంతో కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కయిన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఢిల్లీలోని లక్ష్మీ నగర్ లో భోజ్ పురి చిత్రాల్లో నటించే ముహమ్మద్ షాహిద్ (23) నివాసం ఉంటున్నాడు. అతనికి ముస్కాన్ మొదటి భార్య. వీరికి షహనాజ్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా విడివిడిగా ఉంటుండగా, ముస్కాన్ మరో వివాహం చేసుకుంది.

షాహిద్ కూడా సునయన శర్మ అలియాస్ అలీషా అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు షెహనాజ్ తల్లి సంరక్షణలో ఉండగా, అతన్ని అప్పుడప్పుడూ చూసేందుకు షాహిద్ కు అనుమతి ఉంది. అయితే, కుమారుడిని చూసేందుకు షాహిద్ ను ముస్కాన్ అనుమతించడం లేదు. అమెకు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో అలీషాతో కలసి కుమారుడిని కిడ్నాప్ చేశాడు. ఆపై తన మాజీ భార్య నిర్లక్ష్యం వల్లే కొడుకు కిడ్నాప్ కు గురయ్యాడని కేసు పెట్టాడు. పోలీసులు విచారణ చేపట్టగా, ఆ బాలుడు షాహిద్ ఇంట్లోనే ఉన్నాడని తేలింది. దీంతో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News