: సంచలనం సృష్టిస్తున్న దోపిడీ.. కన్నడ నటుడి అల్లుడి ఇంట్లో భారీ చోరీ.. 21 కేజీల బంగారాన్ని దోచుకుపోయిన ఆగంతుకులు!
కన్నడ నటుడి అల్లుడి ఇంట్లో జరిగిన భారీ చోరీ సంచలనం సృష్టిస్తోంది. కోట్ల రూపాయల విలువ చేసే బంగారు బిస్కెట్లను దొంగలు ఎత్తుకెళ్లిన విషయం బయటపడి తీవ్ర చర్చనీయాంశమైంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కన్నడ నటుడు దొడ్డణ్ణ అల్లుడు కేసీ వీరేంద్ర అలియాస్ పప్పి చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె పట్టణంలోని పాత టౌన్‌లో నివాసముంటున్నారు.
సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం బీరువాను పగలగొట్టి అందులో ఉన్న 21 కిలోల బంగారు బిస్కెట్లను ఎత్తుకెళ్లారు. వాటి విలువ సుమారు రూ.6.30 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. దొంగలు వెళ్తూవెళ్తూ వీరేంద్ర ఇంటికి సమీపంలోనే ఉన్న ఆయన సోదరుడు తిప్పేస్వామి ఇంట్లోకి కూడా చొరబడ్డారు.
లాకర్‌లో ఉన్న రూ.10.70 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో సహా ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిపుణులు వేలి ముద్రలు సేకరించారు. ఇద్దరు పనిమనుషులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల వీరేంద్ర ఇంటిపై దాడిచేసిన ఐటీ అధికారులు బాత్‌రూమ్ గోడలోని సీక్రెట్ లాకర్‌లో దాచిపెట్టిన రూ.6 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, తాజా దోపిడీ బాగా తెలిసిన వారి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.