: వీసా కారణంగా ఆగిపోనున్న సంజయ్‌దత్ సినిమా!
సంజయ్‌దత్ హీరోగా వచ్చిన `మున్నాభాయ్ ఎంబీబీఎస్`, `లగేరహో మున్నాభాయ్` సినిమాలు భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లోనే త్వరలో `మున్నాభాయ్ ఛలే అమెరికా` సినిమా తీయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన టీజర్‌ను కూడా రెండేళ్ల క్రితం వారు విడుదల చేశారు. అయితే ఈ చిత్రం ఆగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
తనకు అమెరికా వీసా రాని కారణంగా `ఛలే అమెరికా` చిత్ర షూటింగ్ జరపడం సాధ్యం కాదని సంజయ్‌దత్ తెలిపారు. జైలు శిక్ష అనుభవించిన వారికి అమెరికా వంటి దేశాలు వీసా ఇవ్వడానికి నిరాకరిస్తాయి. సంజయ్‌దత్ మూడేళ్లు జైలు శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే. అయితే మున్నాభాయ్ సిరీస్‌లో మాత్రం మూడో సినిమా ఉంటుందని, దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సంజయ్‌దత్ `భూమి` సినిమా ప్రచారకార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.