: నిజజీవితంలో `ఫార్మ్విల్లే` ఆట ఆడే అవకాశం కల్పిస్తున్న బెంగళూరు స్టార్టప్
ఫేస్బుక్ ప్రాచుర్యం పొందుతున్న రోజుల్లో ఓ గేమ్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. 2009లో `ఫార్మ్విల్లే` అనే గేమ్ ఆడని ఫేస్బుక్ యూజర్ లేడనడంలో అతిశయోక్తి లేదు. వ్యవసాయం మీద ఆసక్తి ఉన్న వాళ్లంతా ఇంటర్నెట్లో ఈ గేమ్ ద్వారా వారి కలను సాకారం చేసుకున్నారు. విత్తనాలు వేయడం, పురుగు మందులు చల్లడం, పంటను కోయడం వంటి పనులన్నీ ఈ ఆటలో చేసేవారు. ఇప్పుడు అదే ఆటను నిజజీవితంలో ఆడే అవకాశాన్ని బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ ఫార్మిజెన్ టెక్నాలజీస్ తమ యాప్ ద్వారా కల్పిస్తోంది.
ఈ యాప్ ద్వారా రసాయన రహిత కూరగాయలను స్వయంగా పెంచుకునే సదుపాయం ఉంది. అమెజాన్లో పనిచేసిన శమీక్ చక్రవర్తి, సుధాకీరన్ బాలసుబ్రమణ్యన్, గార్డెనింగ్ నిపుణురాలు గీతాంజలి రాజమణితో కలిసి జనవరిలో ఈ కంపెనీని ప్రారంభించారు.ఈ యాప్ ద్వారా యూజర్ బెంగళూరు చుట్టుపక్కల వ్యవసాయ భూమిని అద్దెకు తీసుకోవచ్చు. అందులో పండించాలనుకుంటున్న కూరగాయలను కూడా ఎంచుకోవచ్చు. తర్వాత ఎప్పటికప్పుడు పంట గురించి వివరాలు తెలుసుకోవచ్చు. పంట చేతికందాక దాన్ని ఇంటికి కూడా తెప్పించుకోవచ్చు. కావాలనుకుంటే అప్పుడప్పుడు వ్యవసాయ భూమిని సందర్శించే అవకాశాన్ని కూడా ఈ కంపెనీ కల్పిస్తోంది. ప్రస్తుతం 1.5 ఎకరాల భూమిలో కొన్ని కూరగాయలను ఈ కంపెనీ పండిస్తోంది. దీనికి దాదాపు 79 మంది యాప్ యూజర్ల నుంచి నిధులు అందుతున్నట్లు సమాచారం.