: మోసం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేము... సదావర్తి భూములను మళ్లీ వేలం వేయండి: సుప్రీంకోర్టు
సదావర్తి భూముల వ్యవహారం తిరిగి మొదటికి వచ్చింది. ఈ భూములను మరోసారి వేలం వేయాలని కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. ఈ భూములను తక్కువ ధరకే అప్పనంగా సొంతం చేసుకున్నారన్న అనుమానం తమకుందని, మోసం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేమని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు, వేలంలో పిటిషనర్ కూడా పాల్గొనాలని తెలిపింది. ఈ భూముల వేలం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని సంజీవరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేయగా, విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు వెలువరించింది.
తొలుత రూ. 22 కోట్లకు అప్పనంగా, ఆపై వైకాపా నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో రూ. 5 కోట్లు ఎక్కువ ఇచ్చి ఈ భూములను చౌకగా కొట్టేసేందుకు చూశారని పిటిషనర్ వాదించగా, ఏపీ ప్రభుత్వం చేసిన వాదనను తిరస్కరిస్తూ, హైకోర్టు నిర్ణయించిన తేదీల్లోనే వేలం నిర్వహించాలని తీర్పిచ్చింది. కాగా, తమిళనాడులోని చంగల్పట్టు వద్ద సర్వే నంబర్ 59/1లో అమరావతి ప్రాంతంలో ఎన్నో దశాబ్దాలుగా సేవలందిస్తున్న సదావర్తి సత్రానికి చెందిన భూములున్న సంగతి తెలిసిందే.