: టీపీసీసీ ప్రక్షాళన లేదని అధికారికంగా ప్రకటిస్తే.. మా దారి మేము చూసుకుంటాం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
టీపీసీసీ ప్రక్షాళన లేదని పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటిస్తే..తమ దారి తాము చూసుకుంటామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగితే తాము పార్టీలో ఉండమని, ఉత్తమ్ వల్లే తెలంగాణ మూడేళ్లు ఆలస్యమైందని, నాడు తాను వదిలేసిన మంత్రి పదవిని ఆయన తీసుకున్నాడని విమర్శించారు.
ఉత్తమ్ కుమార్ లాబీయింగ్ చేసి టీ పీసీసీ పదవిని సంపాదించుకున్నాడని, తనను పొమ్మనలేక పొగపెడుతున్నాడని, సోషల్ మీడియా ద్వారా తమపై ఆయన దుష్ప్రచారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతుల్లో తనను కావాలనే అవమానించారని, కార్యకర్తలతో భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో 2019 ఎన్నికలకు వెళ్తే ఐదారు సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.