: సీపీఎల్ లో బౌలర్, బ్యాట్స్ మన్ మధ్య ఆసక్తికర స్లెడ్జింగ్ వివాదం... మీరు కూడా చూడండి!
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) లో ఆసక్తికర రివేంజ్ క్రికెట్ ప్రియులను ఆకట్టుకుంటోంది. గతంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ చేసిన వ్యాఖ్యల కారణంగా బ్రాడ్ పై యువరాజ్ సింగ్ విరుచుకుపడి ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లను బాదిన సంగతి తెలిసిందే. అలాగే తనను ఎద్దేవా చేసిన బౌలర్ కు బ్యాట్స్ మన్ చుక్కలు చూపించిన ఘటన సీపీఎల్ లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... సీపీఎల్ లీగ్ లో భాగంగా జమైకా తల్హాస్-అమెజాన్ వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బౌలర్ విలియమ్స్ వేసిన బంతిని బలంగా కొట్టే ప్రయత్నంలో వాల్టన్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
దీంతో తనను దాటుకుని పెవిలియన్ కు చేరుతున్న వాల్టన్ ముందుకు వెళ్లిన విలియమ్స్ తన చేతిపై ఏదో రాసి, 'ఇది గుర్తుంచుకో' అన్నట్టుగా సైగ చేశాడు. తరువాత మళ్లీ ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈ సందర్భంగా గత మ్యాచ్ లో అవుటైన సందర్భంగా విలియమ్స్ ఎద్దేవా చేసిన సంగతిని బలంగా గుర్తుంచుకున్న వాల్టన్ రెచ్చిపోయాడు. బంతి వెయ్యడమే లేటు... బౌండరీ లైన్ ను తాకేది. ఆ వెంటనే వాల్టన్ తన బ్యాటుతో గత మ్యాచ్ లో విలియమ్స్ చేసిన విధంగా సైగ చేసి రెచ్చగొట్టాడు. ఒక ఓవర్ లో ఏకంగా నాలుగు ఫోర్లు కొట్టి విలియమ్స్ ను ఎద్దేవా చేశాడు. దీంతో కేవలం 40 బంతుల్లో 84 పరుగులు రాబట్టి సత్తాచాటాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా దానిని చూసి ఆనందించండి.