: ఇర్మా అప్ డేట్: అమెరికాకు రూ. 3 లక్షల కోట్లకు పైగా నష్టం కలిగించనున్న తుపాను!
వస్తూ వస్తూనే అమెరికాను వణికించిన ఇర్మా తుపాను ఫ్లోరిడాపై విరుచుకుపడుతోంది. ఈ తుపానుతో 50 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3 లక్షల కోట్లకు పైగా) వరకూ నష్టం వాటిల్లవచ్చని కాటాస్ట్రోప్ హెచ్చరికల సంస్థ ఏఐఆర్ వరల్డ్ వైడ్ అంచనా వేసింది. ఈ డబ్బంతా బీమా కంపెనీలు చెల్లించాల్సి రావచ్చని తెలిపింది. కాగా, ఫ్లోరిడా పవర్ అండ్ లైట్ కంపెనీ విడుదల చేసిన అప్ డేట్ ప్రకారం, మొత్తం 90 లక్షల మంది గాఢాందకారంలో మగ్గిపోనున్నారు.
మరోపక్క, హైవేలపై ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువగా ఉందని ఫ్లోరిడా ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 63 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించామని తెలిపారు. కాగా, చాలా ప్రాంతాల్లో గ్యాస్ స్టేషన్లు నిండుకోగా, పలు ప్రాంతాల్లో తమ వాహనాలతో గ్యాస్ కోసం ప్రజలు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తోంది. ముందుజాగ్రత్త చర్యగా, జాతీయ రహదారులపై వంతెనలను సైతం అధికారులు మూసి వేశారు.