: మాత్రల రూపంలో బంగారాన్ని మింగి వచ్చిన యువకుడు.. పట్టుకున్న విమానాశ్రయ అధికారులు!
అక్రమంగా బంగారాన్ని తరలించడానికి కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాలను కనిపెడుతున్నారు. అయితే, అంతకన్నా తెలివైన అధికారులు వారి ఆటలను సాగనివ్వడం లేదు. చెన్నై విమానాశ్రయంలో ఈ రోజు అధికారులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతడు మాత్రల రూపంలో తయారు చేసిన బంగారాన్ని మింగి అరబ్‌దేశం నుంచి విమానంలో వచ్చాడని అధికారులు తెలిపారు. తమకు అందిన రహస్య సమాచారం ఆధారంగా ఆ వ్యక్తిని పట్టుకున్నట్లు చెప్పారు.
తమకు సమాచారం అందడంతో విమాన ప్రయాణికులందరినీ నిశితంగా గమనించామని చెప్పారు. ఆ సమయంలోనే అనుమానాస్పదంగా నడిచి వస్తున్న ఓ యువకుడిని పట్టుకుని ప్రశ్నించామని, అతను పొంతన లేని సమాధానాలు చెప్పాడని తెలిపారు. దీంతో ఎక్స్‌రే ద్వారా పరిశీలన చేయగా, అతడి కడుపులో ఏదో పదార్ధం ఉండలుగా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. తరువాత అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేసి వాటిని తీయించామని తెలిపారు. ఆ బంగారం విలువ రూ.7 లక్షలు ఉంటుందని చెప్పారు. ఆ యువకుడు కోళికొడువై సమీపంలోని కొడువళ్లి ప్రాంతానికి చెందిన నావాస్ (34) అని చెప్పారు.