: శాంసంగ్ గెలాక్సీ నోట్8 స్మార్ట్‌ఫోన్‌కు భారీ స్థాయిలో ప్రీ-బుకింగ్స్
సెప్టెంబర్ 12న భారత దేశంలో అధికారికంగా విడుదల కాబోతున్న శాంసంగ్ గెలాక్సీ నోట్8 స్మార్ట్‌ఫోన్‌కు భారీ సంఖ్యలో ప్రీ-బుకింగ్స్ నమోదవుతున్నాయి. ఇప్పటికే వీటి సంఖ్య 2.5 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. వీటిలో 1.5 లక్షలకు పైగా ప్రీ-బుకింగ్స్ అమెజాన్ నుంచి రాగా, లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు శాంసంగ్ ఇండియా వెబ్సైట్ నుంచి వచ్చినట్లు సమాచారం. అయితే ఇదేరోజు ఆపిల్ సంస్థ కూడా కాలిఫోర్నియాలో ఐఫోన్8 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐఫోన్ లాంచ్ గురించి తెలిసే, శాంసంగ్ ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువస్తోందని, భారత్‌లో తన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను మరింత పటిష్టం చేసుకోవడానికి శాంసంగ్ ప్రయత్నిస్తోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే స్మార్ట్‌ఫోన్‌ను దక్షిణ కొరియాలో ఆగస్ట్‌లోనే శాంసంగ్ విడుదల చేసింది. ఇందులో ఉన్న 6.3 ఇంచ్ క్వాడ్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్ వంటి ప్రాథమిక ఫీచర్లు స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. అలాగే 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్ లెస్ చార్జింగ్ వంటి ప్రత్యేకతలు గెలాక్సీ నోట్8లో ఉన్నాయి.