: కర్ణాటకలో తెలుగువారిపై దాడుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కాల్వ శ్రీనివాసులు
కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఉద్యోగ పరీక్షలు రాసే నిమిత్తం వెళ్లిన తెలుగువారిపై కన్నడిగులు దాడి చేయడం పట్ల ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలవారిపై దాడులకు తెగబడం దేశ సమగ్రతను దెబ్బ తీస్తుందని ఆయన అన్నారు. జాతీయ స్థాయి పరీక్షలకు వెళ్లే అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉందని తెలిపారు. తెలుగువారిపై దాడులకు సంబంధించి ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పారు. తన నియోజకవర్గమైన రాయదుర్గంలో సగం మంది కన్నడ భాషను మాట్లాడతారని అన్నారు. కన్నడవారిని ఏపీలో అడ్డుకుంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇలాగైతే రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎలా మెరుగుపడతాయని అన్నారు. సంకుచిత భావాలను విడనాడాలని చెప్పారు.