: మనిషి 27 భావోద్వేగాలను పలికించగలడు... పరిశోధనలో వెల్లడి!
పరిస్థితిని బట్టి మానవుడు తన ముఖంలో 27 రకాల భావోద్వేగాలను (హ్యూమన్ ఎమోషన్స్) పలికించగలడని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. సాధారణంగా పలికించే సంతోషం, దుఃఖం, కోపం, ఆశ్చర్యం, భయం, అసహ్యం లాంటి భావావేశాలే కాకుండా మరికొన్ని విభిన్న భావోద్వేగాలను పలికించగలడని కాలిఫోర్నియాలోని బర్క్‌లీ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇందుకోసం వీరు 800ల మంది స్త్రీ, పురుషులపై పరిశోధన చేశారు. రెండువేలకు పైగా వీడియో క్లిప్పింగ్‌లను చూపించి వారిలోని భావోద్వేగాలను శాస్త్రవేత్తలు కచ్చితంగా అంచనా వేశారు.
వీడియోలు చూస్తున్నపుడు వారిలో కలిగిన భావోద్వేగాలు, భావావేశాలను విభిన్న కోణాల నుంచి విశ్లేషించారు. వాటి ఆధారంగా ఒక అంచనాకు వచ్చి వివరాలను పటం రూపంలో నమోదు చేశారు. ఈ పటంలో పరిస్థితుల ఆధారంగా వారి ప్రతిస్పందనలను విభజించారు. ఒక్కో భావోద్వేగాన్ని వేర్వేరు రంగులు ఉపయోగించి పటంలో చూపించారు. ఇలా నమోదు చేశాక లెక్కించిన భావోద్వేగాల సంఖ్య 27 వరకు వచ్చిందని వారు తెలిపారు.