: గొప్పలు చెప్పుకోవడం మాని ఆర్థిక వృద్ధిని సాధించి చూపండి: ప్రధాని మోదీకి రఘురామ్ రాజన్ చురక
ప్రధాని నరేంద్రమోదీపై రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సెటైర్లు విసిరారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అంటూ ప్రచారం చేసుకోవడం మాని కనీసం పదేళ్లపాటైనా ఏటా 8 నుంచి 10 శాతం వార్షిక వృద్ధి రేటును సాధించి చూపాలని సూచించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారతదేశం తన చరిత్ర, సంస్కృతి తదితర విషయాలపై గొప్పలు చెప్పుకోవచ్చు కానీ ఆర్థిక వృద్ధి విషయంలో చెప్పుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు.
ఎగుమతులు పెరిగి, ప్రైవేటు పెట్టుబడులు కూడా పెరిగితే తప్ప భారత స్థూల వృద్ధి రేటు పెరిగే అవకాశం లేదని తేల్చి చెప్పారు. భారత్ కంటే చైనా ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని, ఐదు రెట్లు ఎక్కువని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ దేశం ఆర్థిక వ్యవస్థ నత్తనడకన నడిచి, అదే సమయంలో భారత జీడీపీ పరుగులు పెడితే తప్ప దానిని అందుకోవడం అసాధ్యమన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా మూడేళ్లు పనిచేసిన రఘురామ్ రాజన్ గతేడాది రిటైరయ్యారు.