: చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు సక్సెస్.. మహేశ్ బాబు అభినందనలు!
యూకేకు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ సంస్థ 'పీడియాట్రిక్ కార్డియాలజి అండ్ కార్డియాక్ సర్జికల్ క్యాంప్'ను విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ లో గత నెల 27 న ప్రారంభించింది. ఈ నెల 9వ తేదీ వరకు ఈ క్యాంప్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు మహేశ్ బాబు తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా స్పందించారు. ఈ క్యాంప్ లో భాగంగా డాక్టర్ విక్రమ్ కుడుముల, కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ (యూకే)కు చెందిన స్పెషలిస్ట్ సర్జన్స్ బృందం ఇప్పటివరకు 19 మంది చిన్నారులకు ఉచితంగా నిర్వహించిన ఎంతో క్లిష్టమైన గుండె సంబంధిత సర్జరీలు విజయవంతమయ్యాయని అన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రా హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ పి.వి. రమణమూర్తి, చీఫ్ ఆఫ్ చిల్డ్రన్స్ సర్వీసెస్ డాక్టర్ పి.వి. రామారావులు అంతర్జాతీయ ప్రమాణాల మేరకు పని చేస్తూ విజయపథంలో పయనిస్తున్నారని, టీమ్ సభ్యులందరికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నానని మహేశ్ బాబు పేర్కొన్నారు.