: డ్రైవింగ్ స్కూల్ ను ప్రారంభించిన సల్మాన్ ఖాన్... కడుపుబ్బా నవ్వించేలా జోకులే జోకులు!
ముంబై వీధుల్లో వేగంగా కారు నడిపి, రహదారి పక్కన నిద్రిస్తున్న వారి మరణానికి కారణమైన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దోషిగా నిరూపితుడైన సంగతి తెలిసిందే. ఆ కేసులో ముంబై ట్రయల్ కోర్టు ఐదేళ్ల శిక్షను విధించగా, పై కోర్టులో మాత్రం శిక్ష నుంచి తప్పించుకున్నాడు. ఆ సంగతి పక్కన బెడితే, దుబాయ్ లో తాజాగా సల్మాన్ ఖాన్, ఓ డ్రైవింగ్ స్కూల్ ను ప్రారంభించడంతో నెటిజన్లు ఇప్పుడు జోకుల మీద జోకులు వేసుకుంటున్నారు.
'బెల్హాసా' డ్రైవింగ్ సెంటర్ కొత్త బ్రాంచ్ ని ఆయన ప్రారంభించాడు. 'ఈ డ్రైవింగ్ స్కూల్ లో మద్యం అందుబాటులో ఉంచుతారేమో' అని ఒకరు, 'ఇక్కడ శిక్షణ పొందే డ్రైవర్లకు సల్మాన్ యాక్సిడెంట్ చేసి ఎలా తప్పించుకోవాలో శిక్షణ ఇస్తాడేమో' అని ఇంకొకరు, 'భవిష్యత్తులో కృష్ణజింకల పరిరక్షణకు దిగుతాడు' అని మరొకరు, 'ఇందులో శిక్షణ పొందే డ్రైవర్లు వారంతట వారుగా మద్యం తెచ్చుకుని తాగుతూ నేర్చుకోవాల్సి వుంటుంది' అని ఇంకొకరు... ఇలా సాగుతున్నాయి జోకులు. ఇక సల్మాన్ ఖాన్ ను కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ తో పోలుస్తూ కూడా జోకులు వస్తున్నాయి. సల్లూ భాయ్ డ్రైవింగ్ స్కూల్ ను ప్రారంభించడం, కిమ్ జాంగ్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఒకటేనని, కృత్రిమ మేధస్సుపై రాహుల్ గాంధీ ప్రసంగించడం, సల్మాన్ డ్రైవింగ్ స్కూల్ ను ప్రారంభించడాన్ని పోలుస్తూ నవ్వుకుంటున్నారు.