: ట్విట్టర్ లో ఎవరినైనా ప్రధాని ఫాలో అవుతున్నారంటే, వారి క్యారెక్టర్ పై సర్టిఫికెట్ ఇచ్చినట్టు కాదు: బీజేపీ
సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యను సమర్థించిన ఓ వ్యక్తిని ప్రధాని నరేంద్ర మోదీ, తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ ద్వారా ఫాలో అవుతున్నారన్న వార్తలు కలకలం రేపగా, నష్ట నివారణకు ఆ పార్టీ రంగంలోకి దిగింది. నిఖిల్ దాద్చిచ్ అనే యువకుడి ట్విట్టర్ ఖాతాను మోదీ ఫాలో అవుతున్నారు. గౌరీ హత్య తరువాత అతను సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్టు మెసేజ్ పెట్టాడు. దీంతో పలువురు జర్నలిస్టులు, ప్రజాసంఘాలు మోదీకి వ్యతిరేకంగా సరికొత్త ప్రచారం ప్రారంభించి 'బ్లాక్ నరేంద్ర మోదీ' అంటూ నినదించారు.
దీనిపై బీజేపీ స్పందిస్తూ, ట్విట్టర్ లో ఎవరినైనా ప్రధాని ఫాలో అవుతున్నారంటే, వారి క్యారెక్టర్ పై సర్టిఫికెట్ ఇచ్చినట్టు కాదని స్పష్టం చేశారు. ఎన్నో తీవ్ర విమర్శలు చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఖాతాను సైతం మోదీ అన్ ఫాలో చేయలేదని బీజేపీ ఐటీ సెల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఓ అవినీతి కుంభకోణంలో నిందితుడిగా ఉన్న రాహుల్ గాంధీని సైతం మోదీ ఫాలో అవుతున్నారని గుర్తు చేసింది. ఇదిలావుండగా, ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఫాలో అవుతున్న ఆశిష్ మిశ్రా అనే యువకుడు సైతం గౌరీ హత్యపై అనుచిత వ్యాఖ్యలు చేయగా, వాటిని ఖండించిన రవి శంకర్, అతన్ని అన్ ఫాలో చేసినట్టు ప్రకటించారు.